ఐపీఎల్ 2021 ప్రిపరేషన్స్ కు ప్లానింగ్ స్టార్ట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

CSK IPL 2021 Training Camp Venue And Dates Disclosed.ఐపీఎల్ 2021 సీజన్ కోసం క్యాంప్‌ని చెన్నై వేదికగా మార్చి 11 నుంచి ప్రారంభించాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 12:13 PM GMT
CSK IPL 2021 Training Camp Venue And Dates Disclosed

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ అని అంటూ ఉంటారు. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కేవలం గత సీజన్ లో మాత్రమే ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయిందంటే ఆ జట్టు ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని విబేధాలు, గాయాల కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌లో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 7 స్థానంతో సరిపెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఐపీఎల్ 2021 సీజన్ మీద దృష్టి పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఏడాది మ్యాచ్‌లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరిగే సూచనలు కనిపిస్తూ ఉండడంతో.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం క్యాంప్‌ని చెన్నై వేదికగా మార్చి 11 నుంచి ప్రారంభించాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్యాంప్‌ కి మొదటి రోజే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాతో పాటు కొంత మంది యువ క్రికెటర్లు కూడా హాజరవబోతున్నట్లు చెన్నై ఫ్రాంఛైజీ తెలిపింది. ధోనీ, రైనాలు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ క్యాంప్‌ కి మొదటిరోజే హాజరవ్వబోతూ ఉన్నారు.

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట కూడా ఇలానే చెన్నైలో ఓ క్యాంప్‌ని ఆ ఫ్రాంఛైజీ ఏర్పాటు చేయగా.. టీమ్ యూఏఈకి వెళ్లగానే అక్కడ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐపీఎల్ 2021 సీజన్ కోసం కొత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, కె. గౌతమ్, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా వచ్చారు. ఐపీఎల్ 2021 సీజన్‌కి ఆతిథ్యమిచ్చే ఆరు సిటీల్లో చెన్నైకి కూడా చోటు లభించింది. గత సీజన్ లో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా.. ఈసారి టోర్నీలో దుమ్ముదులపాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.
Next Story
Share it