చాహర్ స్వింగ్.. మొయిన్ విధ్వంసం
CSK beat Punjab Kings by 6 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో ధోని సారథ్యంలోని చెన్నై
By తోట వంశీ కుమార్ Published on 17 April 2021 3:13 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ ఏ మాత్రం చెన్నైకి పోటినే ఇవ్వలేకపోయింది. దీంతో ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ.. పాడుతూ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేదించింది.
ఐదు ఓవర్లకే నాలుగు వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు చెన్నై పేసర్ దీపక్ చాహర్(4-1-13-4) చుక్కలు చూపించాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై స్వింగ్, సీమ్‌తో పాటు నకుల్, స్లో బాల్స్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. తొలి ఓవర్‌లో దీపక్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా.. కొద్దిసేపటికే రవీంద్ర జడేజా విసిరిన అద్భుత త్రోకు కేఎల్ రాహుల్(5) రనౌటైయ్యాడు. రెండు బౌండరీలు బాదీ మంచి ఊపుమీద కనిపించిన క్రిస్ గేల్(10) సైతం దీపక్ చాహర్ బౌలింగ్ లో జడేజా పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ (0) కూడా ఔట్ కావడంతో పంజాబ్ 5 ఓవర్లలో 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత ఏ దశలో పంజాబ్ కోలుకోలేదు. యువ ఆటగాడు షారుక్ ఖాన్(47; 36 బంతుల్లో 4పోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పంజాబ్ కనీసం వంద పరుగుల మార్క్‌నైనా దాటింది.
మొయిన్ విధ్వంసం.. డుప్లెసిస్ నిలకడ
స్వల్ప లక్షచేధనకు దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 24 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 5 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను అర్హదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. మొయిన్ అలీ(46; 31 బంతుల్లో 7 పోర్లు, 1 సిక్స్) రాకతో చెన్నై ఇన్సింగ్స్ వేగం పెరిగింది. ఓ వైపు మొయిన్ అలీ బౌండరీలతో విరుచుకుపడగా.. మరో వైపు ఓపెనర్ డుప్లెసిస్ (36 నాటౌట్; 33 బంతుల్లో 3పోర్లు, 1 సిక్స్) అతడికి చక్కని సహకారం అందించాడు. జట్టు విజయతీరాలకు చేర్చాక.. అర్థశతకానికి నాలుగు పరుగుల దూరంలో మొయిన్ ఔట్ కాగా.. ఆ తరువాత రైనా(8), రాయుడు(0) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. అయినప్పటికి చెన్నై కు ఇబ్బంది లేకుండా పోయింది. కరన్(5నాటౌట్)తో కలిసి డుప్లెసిస్ మిగతా పనిని పూర్తి చేశాడు. దీంతో ఈ సీజన్‌లో చెన్నై బోణీ కొట్టింది.
.