చెన్నై 'ఫోర్' కొట్టేసింది
CSK beat KKR BY 27 runs.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని సారథ్యంలో
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 10:30 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని సారథ్యంలో నాలుగోసారి టైటిల్‌ను అందుకుంది. రెండు ఫేజుల్లో జరిగిన ఐపీఎల్ 2021 విజేతగా సీఎస్‌కే నిలిచింది. శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(59 బంతుల్లో 86, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుత్‌రాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 32 పరుగులు, 3 ఫోర్లు, ఓ సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం చేధనలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలింది. దీంతో చెన్నై నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. ఇంతకముందు 2010, 2011, 2018 సీజన్లలో చెన్నై ఐపీఎల్ విజేతగా నిలిచింది.
టాస్ గెలిచిన మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. ఈ సీజన్‌లో అదిరే ఆరంభాలు అందిస్తున్న చెన్నై ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించారు. రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ లు పోటిపడి పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం అందించారు. రుతురాజ్ ఔటైనా వన్‌డౌన్‌లో వచ్చిన ఉతప్ప (15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31) మెరుపులు మెరిపించాడు. ఉన్నంత సేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఉతప్ప పెవిలియన్ చేరిన తరువాత వచ్చిన మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ చేసింది.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(51), వెంకటేశ్ అయ్యర్(50) లు తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అయ్యారు. నితీశ్ రాణా(0), సునీల్ నరైన్(2), ఇయాన్ మోర్గాన్(4), దినేశ్ కార్తిక్(9), షకీబ్(0), త్రిపాఠి(2) లు చేతులెత్తేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు, జోష్ హాజిల్‌వుడ్, జడేజా చెరో రెండు, దీపక్ చాహర్, బ్రావో చెరో వికెట్‌ను పడగొట్టారు. డుప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.