ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక నటించింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్‌లు అందరిని విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్, జడేజా వంటి క్రికెటర్లు పుష్ప చిత్రంలోని పాటలు, డైలాగ్‌లను తమదైన శైలిలో నటించి నెటీజన్ల మనసు దోచుకున్నారు.
తాజాగా ఆ జాబితాలోకి టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా చేరాడు. ఈ చిత్రంలోని 'శ్రీ వల్లి' పాటకు డ్యాన్స్ చేసి అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 'ఇటీవలే అల్లుఅర్జున నటించిన పుష్ప చిత్రాన్ని చూశాను. బ్రదర్.. నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. శ్రీ వల్లి పాటను ఏదో అలా ప్రయత్నించాను' అని రాసుకొచ్చాడు. కాగా.. సురేశ్ రైనా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.