గత వారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో గాయపడిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం డెహ్రాడూన్ నుండి ముంబైకి తరలించనున్నారు. పంత్ నుదిటిపై, కుడి మోకాలికి, కుడి చేయి మణికట్టు, చీలమండ, వీపుపై గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. తదుపరి చికిత్సల కోసం పంత్‌ను బుధవారం తర్వాత ముంబైకి తరలించనున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు.
రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది. శ్రీలంకతో మంగళవారం టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు.
రిషబ్ పంత్‌ను సోమవారం రజత్, నిషు కూడా కలిశారు. పంత్ ను కాపాడింది వీరే..! ఆస్పత్రికి వెళ్లి పంత్‌ను స్వయంగా కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ కారు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న రజత్, నిషు సకాలంలో స్పందించి అతడిని కారు నుంచి బయటకు తీసుకువచ్చారు. తర్వాత అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీసులకు ఫోన్ చేశారు. వీరు ముగ్గురి సహాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.