మహ్మద్ షమీకి ఎన్నికల సంఘం నోటీసులు
ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కింద ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, అతని సోదరుడు మహ్మద్ కైఫ్‌లను ఎన్నికల సంఘం విచారణకు పిలిచింది.
By - Medi Samrat |
ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కింద ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, అతని సోదరుడు మహ్మద్ కైఫ్‌లను ఎన్నికల సంఘం విచారణకు పిలిచింది. డిసెంబర్ 16 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలోని కార్ట్‌జు నగర్ స్కూల్ నుండి నోటీసులు జారీ చేయబడ్డాయి. నోటీసులలో వీరిద్దరూ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, నోటీసు ప్రకారం మహ్మద్ షమీ షెడ్యూల్ చేసిన తేదీకి హాజరు కాలేడు. ఎందుకంటే.. ప్రస్తుతం అతను విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందుకోసం అతడు రాజ్‌కోట్‌లో ఉన్నాడు.
మీడియా నివేదికల ప్రకారం, మహ్మద్ షమీ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లోని వార్డు నంబర్ 93లో ఓటరుగా నమోదయ్యాడు. ఇది రాస్బిహారి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అతను ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించినప్పటికీ, అతడు చాలా సంవత్సరాలుగా కోల్‌కతాలో శాశ్వత నివాసి.
షమీ ప్రస్తుతం బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. సెలక్టర్ల నుంచి మరోసారి నిర్లక్ష్యానికి గురికావాల్సి వచ్చింది. న్యూజిలాండ్ టూర్ కోసం ఇటీవల ఎంపిక చేసిన వన్డే జట్టులో అతనికి చోటు దక్కలేదు. అతను చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారతదేశం తరపున ఆడాడు. అప్పటి నుండి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు.
జాతీయ జట్టు నుండి తొలగించబడినప్పటి నుండి షమీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో 200 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ తర్వాత, షమీ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను ఆడతాడు, ఆ తర్వాత అతను లక్నో సూపర్ జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించే IPL ప్రారంభమవుతుంది.