కరోనా కష్టకాలంలో ఆపద్భాంధవుడిగా మారిన తెలుగు క్రికెటర్
Cricketer Hanuma Vihari Is Helping Covid Patients.కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 4:29 AM GMTకరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసును చాటుకున్నాడు. భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గా జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ క్రికెటర్.. తన మిత్రులు, అనుచరులతో కలిసి కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు.
ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా తన బృందంతో కలిసి సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స కోసం బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరకక చాలా మంది పడుతున్న ఇబ్బందులను చూసి అతడు చలించిపోయాడు. అలాంటి వాళ్లకు అండగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు.
సోషల్ మీడియా ద్వారా సాయం కోరుతున్న వాళ్లకు వీలైనంత త్వరగా బృందం ద్వారా సాయం చేస్తున్నాడు. మా ప్రయత్నాన్ని చూసి స్పూర్తి పొందింన చాలా మంది తనకు తోడుగా ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పాడు విహారి. గాయంతో బాధపడుతూ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించిన దానికంటే.. ఇలా ప్రాణాలు కాపాడటం చాలా గొప్పగా ఉందని విహారి అన్నాడు. 'నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు. అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే' అని అన్నాడు.
ఇక టీమ్ ఇండియా తరుపున 11 టెస్టులు ఆడి 624 పరుగులు చేశాడు. వార్విక్‌షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. జూన్ 18 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలవనున్నాడు.