భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ సౌతాఫ్రికా (సీఏఎస్) డిసెంబర్, జనవరిలో జరగనున్న మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి బీసీసీఐ, సీఏఎస్‌లు శుక్రవారం షెడ్యూల్‌ను ప్రకటించాయి. డిసెంబర్ 10న టీ20 సిరీస్‌తో భారత్ పర్యటన ప్రారంభం కానుంది. జనవరి 3న ప్రారంభమయ్యే చివరి టెస్ట్ మ్యాచ్‌తో పర్యటన ముగుస్తుంది.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 10న డర్బన్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెండో టీ20 మ్యాచ్ డిసెంబర్ 12న గకేబర్హాలో జరగనుంది. మూడో, చివరి టీ20 డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. తొలి వన్డే డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లో, రెండవ వన్డే 19న గకేబర్హాలో మూడవ వన్డే 21న బోలాండ్ పార్క్, పార్ల్ లో జరుగుతాయి. మొదటి టెస్టు డిసెంబర్ 26-30 వరకూ సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ స్టేడియంలో, రెండవ టెస్ట్ జనవరి 3-7 వరకు న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ వేదికగా జరుగనున్నట్లు షెడ్యూల్‌లో వెల్లడించారు.