భార‌త్‌-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  17 Oct 2024 10:14 AM IST
భార‌త్‌-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో పాల్గొన్నారు. అదే సమయంలో జైశంకర్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ల‌తో మాట్లాడారు. పీఎం షెహబాజ్ షరీఫ్ ఇచ్చిన విందు సందర్భంగా జైశంకర్, ఇషాక్ దార్ మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగింది. విందు సందర్భంగా దాదాపు 5 నుంచి 7 నిమిషాల పాటు సాగిన సంభాషణలో.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల నిర్వ‌హ‌ణ‌పై చర్చ జరిగింది. ఈ సంభాషణలో పాకిస్థాన్ హోం మంత్రి సయ్యద్ మొహ్సిన్ రజా నఖ్వీ కూడా పాల్గొన్నారు. ఆయ‌న ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల‌ పునఃప్రారంభంపై చర్చలకు భారత్ అంగీకరించిన‌ట్లు జియో న్యూస్ నివేదిక వెల్ల‌డించింది. అయితే ఈ విషయంపై బీసీసీఐ లేదా పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగే ఛాంపియన్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుండడం గమనార్హం. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప‌శ్న‌. భారత్, పాకిస్థాన్‌లు చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. ఆ తర్వాత రెండు దేశాలు ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడ్డాయి.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించనంత వరకు ఇరుదేశాల మధ్య ఎలాంటి క్రికెట్‌ జరగదని భారత్‌ స్పష్టం చేసింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు.. ఎటువంటి ద్వైపాక్షిక మ్యాచ్ ఆడకూడదని బీసీసీఐ చాలా కాలం క్రితం నిర్ణయించుకుంది, పాకిస్తాన్ సరిహద్దు దాడులు ఆపకపోతే వారితో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించలేమ‌ని స్ప‌ష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితం భారత క్రికెట్ నియంత్రణ మండలి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా భారత ప్రభుత్వం చేతిలో ఉంది. భారత్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. అయితే భారత్ అన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్‌లోనే ఆడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది.

Next Story