'అందుకే అతడిని బౌలింగ్‌కు దూరంగా ఉంచాం'.. రహానే వ్యాఖ్యలపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన ఒక వ్యాఖ్య కొత్త వివాదాన్ని రేకెత్తించింది.
By - Medi Samrat |
ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన ఒక వ్యాఖ్య కొత్త వివాదాన్ని రేకెత్తించింది. ముంబై ఇండియన్స్‌తో ఘోర పరాజయం తర్వాత జట్టులోనే కాకుండా ఐపీఎల్‌లో కూడా అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్ అయిన కామెరాన్ గ్రీన్ ఒక్క ఓవర్ కూడా ఎందుకు బౌలింగ్ చేయలేదని రహానే ప్రశ్నించాడు. మ్యాచ్ అనంతరం.. ఈ విషయానికి క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రమే సమాధానం చెప్పగలదని పరోక్షంగా నిందిస్తూ రహానే వారిపై విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై స్పందించడంతో.. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. దీంతో కేకేఆర్‌కు బౌలింగ్ ఎంపికలు పరిమితమయ్యాయి.. కానీ గ్రీన్‌ను ఉపయోగించుకోకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది.
రహానే ప్రకటన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే స్పందిస్తూ.. ఈ విషయం గురించి కేకేఆర్‌కు ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేసింది. బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ.. "కామెరాన్ గ్రీన్‌కు నడుము కింది భాగంలో గాయం అయింది, దానికి చికిత్స జరుగుతోంది. ఫలితంగా అతడిని కొంతకాలం బౌలింగ్‌కు దూరంగా ఉంచారు. సుమారు 10-12 రోజుల్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం కేకేఆర్‌కు ముందుగానే తెలియజేయబడింది" అని తెలిపారు.
జట్టుకు గ్రీన్ లేకపోవడం కేకేఆర్‌కు పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా, మతిషా పతిరానాల గాయాలతో జట్టు సతమతమవుతోంది. దానికి తోడు, ముస్తఫిజుర్ రెహమాన్‌ను కూడా విడుదల చేయాల్సి రావడం బౌలింగ్ విభాగాన్ని మరింత బలహీనపరిచింది.
ప్రస్తుతానికి గ్రీన్ జట్టు కోసం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడనున్నాడు. నివేదికల ప్రకారం, అతను మొదటి నాలుగు మ్యాచ్‌లలో బౌలింగ్ చేయడు. ఏప్రిల్ 9వ తేదీన బౌలింగ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.