మరో మూడు రోజుల్లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుందనగా టీమ్ఇండియాలో కరోనా కలకలం రేగింది. ఒకే సారి ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్, యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు సహాయక సిబ్బంది మరో 5 ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కరోనా బారిన పడిన వారిని వేర్వేరు గదుల్లో ఐసోలేట్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఆటగాళ్లందరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పరీక్షల తరువాతనే సిరీస్‌పై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం అతిథ్యం ఇచ్చే మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమ్ఇండియా, విండీస్ జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి.
కాగా.. వన్డే, టీ 20 జట్ల కెప్టెన్సీ చేపట్టిన తరువాత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆడే తొలి సిరీస్ ఇదే. ఇక ధావన్ అందుబాటులో లేకపోవడంతో వెంకటేశ్ అయ్యర్ కు తుది జట్టులో చోటు దక్కవచ్చు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు విండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.