పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తో సమాంతరంగా పాకిస్థాన్ క్రికెట్ లీగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలని నిర్ణయించడంతో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ వైపు మొగ్గు చూపడంతో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. ఆటగాళ్లు రెండు ఫ్రాంచైజీ లీగ్‌ల మధ్య నిర్ణయం తీసుకోవలసి రావడంతో, మెరుగైన పారితోషికం, ఎక్స్‌పోజర్ వరకు అనేక కారణాల వల్ల IPLకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కార్బిన్ బోష్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. ముందుగా పీఎస్ఎల్ లో ఆడేందుకు అంగీకరించి, హఠాత్తుగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో ఒప్పందం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన బోష్ ఈ ఏడాది పాకిస్థాన్ మీదే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో బాగా ఆడడంతో అతడిని పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ పెషావర్ జల్మి తమ జట్టులోకి తీసుకుంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో తాము కొన్న దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ గాయపడడం వల్ల ముంబయి ఇండియన్స్ అతడి స్థానాన్ని బోష్ తో భర్తీ చేసుకుంది.