విరాట్ బ్యాటింగ్‌పై ద్రావిడ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌

Coach Rahul Dravid Working on Virat Kohli's Batting.మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జ‌ట్టు సౌతాఫ్రికాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 3:36 PM IST
విరాట్ బ్యాటింగ్‌పై ద్రావిడ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జ‌ట్టు సౌతాఫ్రికాలో ప‌ర్య‌టిస్తోంది. భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కెప్టెన్సీ వివాదం త‌రువాత భార‌త జ‌ట్టు ఆడ‌బోతున్న తొలి సిరీస్ కావ‌డంతో అంద‌రి దృష్టి దీనిపైనే ఉంది. ఇక సౌతాఫ్రికాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా భార‌త జ‌ట్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని ఆట‌గాళ్లు గ‌ట్టిప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వ‌ర్యంలో తీవ్రంగా సాధ‌న చేస్తున్నారు. ద్రవిడ్ జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు బీసీసీఐ షేర్ చేసిన చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ద్రావిడ్ ప‌లు సూచ‌న‌లు చేస్తూ క‌నిపించాడు. గ‌త కొంత‌కాలంగా విరాట్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడ‌డం లేదు. గ‌త 13 టెస్టుల్లో ఒక్క శ‌త‌కం కూడా సాధించ‌లేదు. 2019 న‌వంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన డే అండ్ నైట్ టెస్టులో విరాట్ శ‌త‌కం సాధించాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క శ‌త‌కం కూడా చేయ‌లేదు. మ‌రోవైపు సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ గాయం కార‌ణంగా ఈ సిరీస్ దూరం కావ‌డం, ర‌హానే, పుజారా ఫామ్ లేమీతో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డంతో బ్యాటింగ్ భారం మొత్తం కోహ్లీపై ప‌డిన‌ట్ల‌యింది. మ‌రో వైపు కెప్టెన్సీ వివాదం. వీట‌న్నంటి మ‌ధ్య విరాట్ ఎలా రాణిస్తాడా అన్న దానిపై అంద‌రి దృష్టి నెల‌కొంది.

ద్రవిడ్ రికార్డుపై కోహ్లీ క‌న్ను..

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రావిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 11 మ్యాచ్‌ల్లో 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. విరాట్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మ్యాచుల్లో 558 ప‌రుగులు చేశాడు. మ‌రో 66 ప‌రుగులు చేస్తే ద్రావిడ్ రికార్డును అధిగ‌మిస్తాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 1161ప‌రుగుల‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

Next Story