రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. గత మ్యాచ్ లో సంజూ శాంసన్ సింగిల్ తిరిగే అవకాశం ఉన్నా కూడా క్రిస్ మోరిస్ కు అవకాశం ఇవ్వలేదు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మాత్రం తాను ఎంత విలువైన ఆటగాడినో రుజువు చేశాడు క్రిస్ మోరిస్.
ముంబై వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. క్రిస్ మోరిస్ విధ్వంసకర బ్యాటింగ్ (18 బంతుల్లో 4 సిక్స్ లతో 36)తో మ్యాచ్ రాజస్థాన్ వశమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ, 32 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఆర్ఆర్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. 148 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.
రాయల్స్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. రాయల్స్ జట్టులో బట్లర్ 2, మన్ వోహ్రా 9, సంజూ శాంసన్ 4, శివమ్ దూబే 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. డేవిడ్ మిల్లర్ రాణించాడు. మిల్లర్ 62 పరుగులకు చేయగా.. తెవాటియా 19, ఉనద్కత్11, రబడ 19, మోరిస్ 36 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ లో గత రెండు మ్యాచ్ లలో తక్కువ స్కోరును నమోదు చేసి.. గెలిచాయి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం రాయల్స్ పోరాడి గెలిచింది. లోయర్ ఆర్డర్ లో వచ్చిన మోరిస్ మ్యాచ్ ను తిప్పేశాడు.