దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ఆ ప్రభావం ఐపీఎల్ మీద కూడా పడింది. పలువురు క్రికెటర్లకు భయాందోళనకు గురవుతూ ఉండడంతో టోర్నమెంట్ నుండి తప్పుకుంటూ ఉన్నారు. ఆండ్రూ టై, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ టోర్నీ నుండి వైదొలిగారు. ఆస్ట్రేలియా ప్లేయర్స్‌లో ఒక రకమైన ఆందోళన నెలకొన్నదని ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుండగా.. అది జరగక ముందే ఇంటికి వెళ్లిపోవాలని వార్నర్, స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ భావిస్తున్నారని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది.
ఈ వార్తలు ఇలా ఉండగా.. ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న ఆసీస్ ఆటగాడు క్రిస్ లిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ముగియనుందని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి తమను భారత్ నుంచి తీసుకెళ్లాలని క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు)ను కోరాడు. తాము ప్రస్తుతానికైతే కఠిన నిబంధనలతో కూడిన బబుల్ లో ఉన్నామని తెలిపాడు. అంతేకాకుండా వచ్చే వారం కరోనా టీకా తీసుకుమంటామని లిన్ చెప్పాడు. తమను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లే అంశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలించాలని విజ్ఞప్తి చేశాడు. టోర్నమెంట్ ముగిశాక ఆసీస్ క్రికెటర్లు వెళ్ళడానికి ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుందని ఇప్పటికే చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ పనే చేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఓ క్లారిటీ ఇస్తే.. వాళ్లు హ్యాపీగా ఈ సీజన్ ను ఆడేసి వస్తారు.