ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ IPL 2023లో భాగమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టులో అతడు చేరాడు. మిగిలిన మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడనున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో జోర్డాన్ INR 2 కోట్ల బేస్ ధరకు అమ్ముడుపోలేదు.. ముంబై శిబిరం గాయాల బారిన పడడంతో జోర్డాన్ ను తీసుకుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు జోర్డాన్ ఆడాడు. జోర్డాన్ ముంబై ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండడం కన్పించింది. 34 ఏళ్ల జోర్డాన్ 28 ఇన్నింగ్స్‌లలో 30.85 సగటుతో, 9.32 ఎకానమీతో 27 IPL వికెట్లు తీశాడు. జోర్డాన్ చివరిసారిగా 2022లో సూపర్ కింగ్స్ తరఫున IPL ఆడాడు. అతను నాలుగు మ్యాచ్ లలో రెండు వికెట్లు సాధించాడు.
స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కావడంతో.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా వీక్ గా కనిపిస్తోంది. జోర్డాన్ వారి బౌలింగ్ విభాగానికి బలం చేకూరుస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో వాంఖడే వేదికగా తలపడనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం.