వెడ్డింగ్ కార్డులు.. అక్కడ ధోనిపై.. ఇక్కడ జనసేనానిపై

Chhattisgarh Man Prints MS Dhoni's Photo On His Wedding Card, Pic Goes Viral. పెళ్లిళ్ల సమయంలో వెడ్డింగ్ కార్డులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. వెడ్డింగ్ డిజైన్ విషయమే కాకుండా..

By Medi Samrat  Published on  4 Jun 2023 11:25 AM IST
వెడ్డింగ్ కార్డులు.. అక్కడ ధోనిపై.. ఇక్కడ జనసేనానిపై

పెళ్లిళ్ల సమయంలో వెడ్డింగ్ కార్డులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. వెడ్డింగ్ డిజైన్ విషయమే కాకుండా.. కొన్ని కొన్ని సార్లు తాము ఆరాధించే వ్యక్తులకు కూడా వెడ్డింగ్ కార్డులను డెడికేట్ చేస్తూ ఉంటారు. గతంలో అలాంటి ఘటనలను చాలానే చూశాం. ఇప్పుడు రెండు వెడ్డింగ్ కార్డుల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు.

మహేంద్ర సింగ్ ధోని నామంతో ఇటీవల ఐపీఎల్ మారు మ్రోగిపోయింది. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ అభిమాని మహీపై ఉన్న ప్రేమను వెడ్డింగ్ కార్డుతో చాటుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ రాయగఢ్ జిల్లాలోని తమ్నార్‌కి చెందిన దీపక్‌కి ధోనీ అంటే విపరీతమైన అభిమానం. ఎంతగా అంటే తన పెళ్లికార్డులో రెండువైపుల ధోనీ ఫోటోని వేయించుకున్నాడు. తలా అనే పదం వెడ్డింగ్ కార్డ్‌పై రాయించుకున్నాడు. దీపక్‌కి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ధోనిని ఆదర్శంగా తీసుకునేవాడు. ధోనీ మీద తన అభిమానం చాటుకోవడానికి తన పెళ్లి సరైన వేదిక అనుకున్నాడు. అతని కాబోయే భార్య గరీమాతో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు ధోనీ జెర్సీ నంబర్ 7, ధోని ఫోటోను తన పెళ్లి కార్డుపై వేయించుకున్నాడు. ఈ కార్డు ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భారీగా అభిమానులు ఉన్నారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు ఓ పార్టీ కార్యకర్త. తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ఏకంగా పార్టీ హామీలను ముద్రించి పవన్ అంటే ఉన్న అభిమానాన్ని చాటాడు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన లచ్చిపతుల రంజిత్ కుమార్ పార్టీ వింగ్ ఐటీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆయన వివాహం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధం చేసిన ఆహ్వాన పత్రికల కవరుపై పవన్ కళ్యాణ్ వారాహి, లోపల పార్టీ ఇచ్చిన హామీలను ప్రచురించాడు. తనకు జనసేన మీద ఎంతో నమ్మకం ఉందని.. పవన్ కళ్యాణ్ మన జీవితాలను మారుస్తారని రంజిత్ చెప్పుకొచ్చారు. ఈ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story