స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం
Chetan Sharma resigns as BCCI chief selector.బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2023 11:54 AM ISTభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రటరీ జై షాకు తన రాజీనామా లేఖను పంపగా వెంటనే ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన భారత ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమ్ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై చేతన్ శర్మ పలు కీలక విషయాలను వెల్లడించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి కూడా చెప్పాడు. కొందరు భారత ఆటగాళ్లు ఫిట్‌గా లేనప్పటికి పలు ఇంజక్షన్లు తీసుకుని పూర్తి ఫిట్‌నెస్ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతున్నట్లు ఆరోపించాడు.
భారత ఆటగాళ్లు 80 ఫిట్‌గా ఉన్నా సరే ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్ నెస్ సాధిస్తారు. అవి నొప్పి మందులు కావు. డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులు వాడుతారు. సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లు కూడా ఈ ఇంజెక్షనను ఉపయోగిస్తున్నారు. ఇక భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే మరో వర్గాన్ని కోహ్లీ నడిపిస్తాడు. అయితే.. వీరిద్దరి ఎలాంటి సమస్యలు లేవని చెప్పాడు. కోహ్లీ ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్న సమయంలో అతడికి రోహిత్ అండగా నిలిచాడన్నారు.
అయితే కోహ్లీ, రోహిత్ మధ్య అహం సమస్యగా ఉందన్నారు. అది అమితాబ్, ధర్మేంద్ర మధ్య ఉన్నట్లుగానే ఉంటుందని చెప్పాడు. ఇక రోహిత్, హార్థిక్ పాండ్యలు తనను గుడ్డిగా నమ్ముతారని, ఆ ఇద్దరు తన ఇంటికి వచ్చినట్లు తెలిపాడు. హార్థిక్ అయితే.. తన భవిష్యత్తు గురించి తరచు తనను కలుస్తాడంటూ చెప్పుకొచ్చాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్, కోహ్లీల మధ్య అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను కూడా చెప్పాడు.
ఇలా జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు అన్ని చెప్పేశాడు. మొత్తంగా ఆ స్టింగ్ ఆపరేషన్ వివాదాలకు దారి తీయడంతో చేతన్‌పై వేటు వేసే అవకాశం ఉందని బావిస్తుండగా.. రాజీనామా చేయడం గమనార్హం.