చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి ఆ ఆటగాడు దూరం
Chennai Super Kingss Pacer Deepak Chahar ruled out of IPL 2022.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ లో ఇప్పటి
By తోట వంశీ కుమార్ Published on 12 April 2022 4:02 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా బోణి కొట్టలేదు. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేతృత్వంలో బరిలోకి దిగుతున్న చెన్నైకి ఏదీ కలిసి రావడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. రూ.14 కోట్లు పెట్టి మరీ కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడు.
ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తొడకండరాల గాయంతో బాధపడుతున్న చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో గాయం నుంచి కోలుకుంటూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నాడు. లీగ్‌లోని సగం మ్యాచ్‌ల తరువాత అందుబాటులోకి వస్తాడని అంతా బావించారు. అయితే.. దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. అతడు వెన్నుగాయంతో బాధపడుతున్నట్లు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. దీంతో చాహర్‌కు మరో నెల రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ లోపు ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. కాబట్టి చాహర్ ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనంలో తెలిపింది.
ఈ వార్త విన్న చెన్నై అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. పవర్ ప్లేలో వికెట్లు తీసే దీపక్ చాహర్ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో అవకాశాలు దక్కించుకున్న తుషార్ పాండే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, మహేష్ తీక్షణలు అంతగా రాణించడం లేదు. ఇక నేడు ఐపీఎల్‌లో చెన్నై జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు రాజవర్దన్ హంగర్గేకర్‌ను ఆడించే అవకాశం ఉంది.