ఐపీఎల్ లో కరోనా కలకలం మొదలైంది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అయితే మిగిలిన ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ తెలిపింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కూడా కరోనా కలకలం మొదలైంది. చెన్నై క్యాంపులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ సిఈఓ కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్సు క్లీనర్ కు కూడా కరోనా సోకింది. దీంతో వీరిని క్వారెంటైన్ లోకి పంపారు. 10 రోజుల పాటూ జట్టుతో వీరు కలవరని తెలిపారు. రెండు సార్లు నెగటివ్ టెస్టులు వచ్చిన తర్వాతనే జట్టులోకి తీసుకోనున్నారు. ఈ వార్తతో చెన్నై సూపర్ కింగ్స్ బృందం ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకుంది.

ఇక డీడీసిఏ గ్రౌండ్ స్టాఫ్ కు చెందిన 5 మందికి కూడా కరోనా సోకింది. ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో వీరు విధులు నిర్వర్తించారట. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు.

సామ్రాట్

Next Story