దాదాకు జ‌రిమానా విధించిన కోల్‌క‌తా హైకోర్టు

Calcutta High Court fines Sourav Ganguly.భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్య‌క్ష‌డు, మాజీ కెప్టెన్ సౌర‌వ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2021 1:38 PM IST
దాదాకు జ‌రిమానా విధించిన కోల్‌క‌తా హైకోర్టు

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్య‌క్ష‌డు, మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీకి కోల్‌క‌తా హైకోర్టు షాకిచ్చింది. ఆయ‌న‌కు రూ.10వేల పైన్ విధించింది. స్థానిక అధికారులు అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో గంగూలీకి భూమిని కేటాయించార‌ని కోల్‌క‌తా హైకోర్టు తేల్చింది. భూమిని కేటాయించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో పాటు బెంగాల్ గృహ మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్ కు సైతం రూ.50వేల చొప్పున జ‌రిమానా విధించారు. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి అందించాల‌ని ఆదేశించింది.

వివ‌రాల్లోకి వెళితే.. కోల్‌క‌తా స‌మీపంలోని ఓ పాఠ‌శాల భ‌వ‌నం నిర్మాణం కోసం 2013లో కోల్‌క‌తా ప్ర‌భుత్వం న్యూటౌన్ ప్రాంతంలో 2 ఎక‌రాల భూమిని కేటాయించింది. కాగా.. ఆ కేటాయింపు అక్ర‌మ‌మ‌ని 2016లో ఓ వ్య‌క్తి ప్ర‌జాహిత వ్యాజ్యం దాఖ‌లైంది. గ‌తేడాది ఆగ‌స్టులో ఆ భూమిని గంగూలీ ప్ర‌భుత్వానికి తిరిగి ఇచ్చేశారు. తాజాగా దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. సుప్రీం కోర్టు కొట్టివేసిన నిబంధ‌న‌ల కింద భూమి కేటాయించినందుకు దాదాతో పాటు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం, హౌసింగ్ బోర్డు కార్పొరేష‌న్‌ల‌కు జ‌రిమానా విధించింది. లబ్ధిదారులు భూమిని తిరిగిచ్చేసినా.. చట్ట ప్రకారం ఆ కేటాయింపు అక్రమమేనని, దానిని తీసుకోవడమూ అక్రమమేనని న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. కేటాయింపునకు కారణమైన అధికారులు, ఉద్యోగుల నుంచి ఆ జరిమానా మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది.

దేశం ఎల్లప్పుడూ క్రీడాకారులకు, ప్రత్యేకించి అంతర్జాతీయ ఈవెంట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అండగా ఉంటుంద‌ని, క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ దేశం కోసం పురస్కారాలను తెచ్చాడనేది కూడా వాస్త‌వ‌మేన‌ని.. కానీ చట్టం ముందు అంద‌రూ స‌మాన‌మేన‌ని చెప్పింది. చ‌ట్టానికి విరుద్దంగా ఎవరూ ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ది పొందేందుకు వీల్లేద‌ని న్యాయ‌స్థానం చెప్పింది.

Next Story