బట్లర్ బాదేశాడు.. సన్ రైజర్స్ ఛేజింగ్ చేసేనా..?
Buttler 124 fires Royals to 220. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ భీభత్సం
By Medi Samrat Published on 2 May 2021 5:29 PM ISTసన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ భీభత్సం సృష్టించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ప్రత్యర్థి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో వార్నర్ ను హైదరాబాద్ జట్టు పక్కన పెట్టింది. రాజస్థాన్ ఆచితూచి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్(12) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బట్లర్ తో జతకలిసిన సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడమే కాకుండా.. పరుగుల వరదను పారించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపారు ఇద్దరూ..!
ఈ నేపథ్యంలోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న బట్లర్ నబీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లలో రెండు ఫోర్లు.. రెండు సిక్సర్లు సమా మొత్తం 21 పరుగులు సాధించాడు. ఆ తర్వాత విధ్వంసం కొనసాగింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఆఖరిబంతికి సింగిల్ తీయడం ద్వారా బట్లర్ ఐపీఎల్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 56 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు బట్లర్. 48 పరుగులు చేసిన సామ్సన్ విజయ్ శంకర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 33 బంతుల్లో సంజూ 48 పరుగులు చేశాడు. 64 బంతుల్లో 124 పరుగులు చేసి బట్లర్ అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు ఉన్నాయి. ఆఖర్లో పరాగ్, మిల్లర్ థలా ఓ సిక్సర్ ను బాదారు. సన్ రైజర్స్ బౌలర్లలో సందీప్, రషీద్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.