ముంబై వరుస ఓటములపై రోహిత్ శర్మ, బుమ్రా చెబుతోంది ఇదే..!

ముంబై వరుస ఓటములపై రోహిత్ శర్మ, బుమ్రా చెబుతోంది ఇదే..! ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ లేనంత చెత్తగా ఆడుతూ ఉంది. వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడింది.

By Medi Samrat  Published on  17 April 2022 6:22 AM GMT
ముంబై వరుస ఓటములపై రోహిత్ శర్మ, బుమ్రా చెబుతోంది ఇదే..!

ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ లేనంత చెత్తగా ఆడుతూ ఉంది. వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడింది. 200 పరుగుల ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ముంబయి ఇన్నింగ్స్ లో డివాల్డ్ బ్రెవిస్ 31 పరుగులు (13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ 37, తిలక్ వర్మ 26 పరుగులు చేశారు. ఆఖర్లో కీరన్ పొలార్డ్ (14 బంతుల్లో 25) మెరుపులు మెరిపించినా విజయం మాత్రం అందించలేకపోయాడు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3, జాసన్ హోల్డర్ 1, దుష్మంత చమీర 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఇది ఆరో ఓటమి. ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది.

ఐపీఎల్‌లో వరుస పరాజయాలపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అంచనాలకు తగ్గట్టుగా జట్టును నడిపించలేకపోతున్నానని, అందుకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చాడు. తప్పు ఎక్కడ జరిగిందో తెలిస్తే సరిదిద్దుకోవచ్చని, కానీ అది కనిపించడం లేదని అన్నాడు. ప్రతి మ్యాచ్‌కు బాగానే సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. ప్రపంచం ఏమీ ఇప్పుడే అంతమైపోవడం లేదని, గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురైనా మళ్లీ పుంజుకున్నామన్నాడు. ఇప్పుడు కూడా తిరిగి గాడిన పడేందుకు ప్రయత్నిస్తామన్నాడు. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయామని, కాబట్టి జట్టు కూర్పుపై ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. బౌలర్లు మరింతగా రాణించాల్సి ఉందన్నాడు. పరాజయాలు ఎదురైనప్పుడు తప్పులు వెతకడం చాలా సులభమన్నాడు. లక్నో కెప్టెన్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, తమ జట్టులో అలాంటి ప్రదర్శన లోపించిందని రోహిత్ అన్నాడు.

జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఇక ఇక్కడి నుంచి వన్ వేలో దూసుకుపోతామని చెప్పాడు. సూర్యూడు రేపు కూడా ఉదయిస్తాడు. క్రికెట్ ఆట అంటే అదే.. ఎవరో ఒకరు గెలవాలి. ఎవరో ఒకరు ఓడాలి. జీవితంలో మేము అన్నీ కోల్పోలేదు ఇంకా అని తెలిపాడు. ఒక ఆటలో ఓడిపోయామంతే అని అన్నాడు. మా జట్టులో ఉన్న క్రీడాస్ఫూర్తి ఇది. మా మాదిరిగా ఎవరూ నిరాశ చెందరు. విజయం కోసం పోరాటంలో మేము పెట్టిన కృషిని బయటి వారు ఎవరూ చూడలేరు. మేం బాగా ఆడడం లేదన్నది అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నాడు. మిగిలిన మ్యాచుల్లో మా వంతు మెరుగైన ఆటతీరు కనబరచడానికి ప్రయత్నిస్తామన్నాడు.

Next Story