మ్యాచ్ ఫిక్సింగ్.. స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ పై ఐసీసీ నిషేదం
Brendan Taylor banned by ICC for three and half years.అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జింబాబ్వే
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2022 6:54 AM GMTఅంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై నిషేదం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలడంతో అతడిపై మూడున్నరేళ్ల నిషేదం విధించింది. 35 ఏళ్ల టేలర్ ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలోని నాలుగు రూల్స్‌తో పాటు, యాంటీ డోపింగ్ కోడ్ కింద ఒక రూల్‌ను ఉల్లఘించినట్లు ఒప్పుకున్నాడని అందుకనే అతడిపై మూడున్నరేళ్ల నిషేదం విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకనలో వెల్లడించింది.
ఈ నిషేదం కారణంగా 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్ ఆడేందుకు వీలులేదు. కాగా.. బ్రెండన్ టేలర్ గతసంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. జింబాబ్వే తరుపున టేలర్ 205 వన్డేలు, 34 టెస్టులు, 45 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6,684, టెస్టుల్లో 2,320, టీ20ల్లో 934 పరుగులు చేశాడు.
కాగా.. ఇటీవల బ్రెండన్ టేలర్ సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త 2019లో తనను ఫిక్సింగ్ చేయమని బెదరించాడని.. అందుకు 15 వేల డాలర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఓ పార్టీకి ఆహ్వానిస్తే వెళ్లగా.. అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారవేత్త తనను ఫిక్సింగ్ చేయమని అడిగాడు. అందుకు 15 వేల డాలర్లను ఆఫర్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు ఇచ్చిన 15 వేల డాలర్లను తీసుకున్నా. పని పూర్తి అయ్యాక మరో 20 వేల డాలర్లు ఇస్తానని చెప్పాడు అని టేలర్ తెలిపాడు. అయితే.. తాను ఫిక్సింగ్ పాల్పడలేదని వెల్లడించాడు. కాగా.. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురానందుకు ఐసీసీ బ్రెండన్ టేలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు తను చేసిన తప్పులను అంగీకరించడంతో నిషేదం విధించింది.