క్రీడా ప్రపంచంలో విషాదం.. సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత
Brazilian football legend Pele dies at 82.క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుం
By తోట వంశీ కుమార్ Published on 30 Dec 2022 8:43 AM IST
క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫుట్‌బాట్ దిగ్గజం పీలే కన్నుమూశారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే మూడు సార్లు ప్రపంచకప్ అందుకున్న ఆటగాడిగా నిలిచిన పీలే గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 82 ఏళ్లు.
బ్రెజిల్‌కు చెందిన పీలే పూర్తి పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. నాలుగు ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970 లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఫార్వర్డ్‌గా, అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలో పీలే చేసిన విన్యాసాలు ప్రేక్షకులు ఎప్పటి మరువ లేరు. ప్రత్యర్థి ఆలోచనలను ముందే పసిగట్టి మెరుపువేగంతో బంతిని గోల్‌పోస్టులోకి పంపడంతో అతడికి అతడే సాటి. రెండు దశాబ్దాల పాటు సాకర్ అభిమానులను ఉర్రూతలూగించాడు పీలే.
అయితే.. 1966 ప్రపంచకప్‌లో జట్టు నిరాశజనకమైన ప్రద్శన కారణంగా ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాడిగా బంగారు బంతిని అందుకున్నాడు. యుగోస్లేవియాతో 1971లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడేశాడు. నాలుగు ప్రపంచకప్‌లలో 14 మ్యాచ్‌లు ఆడిన పీలే 12 గోల్స్ సాధించాడు.
పీలే మృతి పట్ల క్రీడా ప్రపంచం నివాళులర్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలురంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.