లంక చేతిలో ఓటమి.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ గుడ్ బై
Bravo confirms retirement from international cricket.వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కీలక ప్రకటన చేశాడు
By తోట వంశీ కుమార్ Published on 5 Nov 2021 4:08 AM GMTవెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కీలక ప్రకటన చేశాడు. టీ 20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. గురువారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం బ్రావో ఈ ప్రకటన చేశాడు. సమయం ఆసన్నమైందని అనిపిస్తోందని.. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించానని చెప్పాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని చెప్పుకొచ్చాడు.
'I think the time has come'
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2021
Dwayne Bravo will conclude his international career at the ongoing #T20WorldCup
తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించానని.. కరేబియన్ ప్రజల తరుపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం పట్ల కృతజ్ఞతాభావంతో తన మనస్సు నిండిపోయిందన్నాడు. ఇక మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన వెస్టిండీస్ జట్టులో ఉండడం తనకు చాలా సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. గురువారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అసలంక (68; 41 బంతుల్లో 8పోర్లు, 1 సిక్స్), నిస్సంక (51; 41 బంతుల్లో 5 పోర్లు) అర్థశతకాలతో రాణించారు. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసింది.
నికోలస్ పూరన్(46; 34 బంతుల్లో 6 పోర్లు, 1సిక్స్) , హిట్‌మైయర్ (81నాటౌట్; 54 బంతుల్లో 8 పోర్లు, 4 సిక్సర్లు) రాణించనప్పటికి మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా క్రిస్‌గేల్(1), అండ్రూ రసెల్ (2), కెప్టెన్ పొలార్డ్ (0) లు ఘోరంగా విఫలం అయ్యారు. ఈ ఓటమితో విండీస్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన విండీస్ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇక టోర్నీలో తన చివరి మ్యాచ్‌లో విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఈ మ్యాచ్ అనంతరం డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు.