ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో పాల్గొనడానికి ముందే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ హజరారే ట్రోఫిలో పాల్గొనే ముంబై సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నెల 20 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ 22 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ముంబై ప్రకటించిన జట్టులో అర్జున్‌కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబై సీనియర్ జట్టుకు ఎంపికైన అర్జున్.. ఆ టోర్నీలో రాణించలేకపోయాడు. ఆడే అవకాశం వచ్చిన ఒక్క మ్యాచ్‌లోనూ రెండు ఓవర్లు వేసిన అతను 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ మెప్పించలేకపోవడంతో.. విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుంచి అతన్ని తప్పించారు. దీంతో ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ 2021 వేలంలో ఇది అర్జున్‌పై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. రూ.20లక్షల బేస్ ప్రైస్‌తో అర్జున్ ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రస్తుతం అర్జున్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే.. ఏ ఫ్రాంచైజీ అతడి కోనుగోలు చేయడానికి ముందుకు వస్తుందో చూడాలి.
ముంబై జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, అఖిల్ హెర్వాడ్కర్, చిన్మయ్ సుతార్, ఆదిత్య తారే, హార్దిక్ తమోర్, శివం దుబే, ఆకాష్ పార్కర్, అతిఫ్ అంటార్వాలా, షమ్స్ ములన్ సైరాజ్ పాటిల్, సుజిత్ నాయక్, తనూష్ కోటియన్, ప్రశాంత్ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, సిద్ధార్థ్ రౌత్, మోహిత్ అవస్థీ.