బెంగళూరు ఆటగాళ్లను దేశం విడిచి పెట్టి వెళ్ళాలన్న స్పోర్ట్స్ మినిస్టర్

Bengaluru FC asked to leave Maldives.కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఏవైనా గేమ్స్ నిర్వహించే సమయంలో ఆటగాళ్లను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 3:32 PM IST
Bengaluru FC

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఏవైనా గేమ్స్ నిర్వహించే సమయంలో ఆటగాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బయో బబుల్ ను ఏర్పాటు చేసి టోర్నమెంట్లను నిర్వహిస్తూ ఉన్నారు. ఎంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నా కూడా ఆటగాళ్లకు కరోనా సోకుతూ ఉంది. ఇలాంటిదే ఐపీఎల్ విషయంలో జరగడంతో టోర్నమెంట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే..! ఇక కొన్ని టోర్నమెంట్ల విషయంలో ఆటగాళ్లు తోక జాడించే అవకాశం లేకపోలేదు. ఇలాంటప్పుడు ఆయా ఆటగాళ్లపై కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఏ.ఎఫ్.సీ. కప్ (AFC Cup) ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల కోసం బెంగళూరు ఎఫ్.సి. క్లబ్ మాల్దీవులకు వెళ్ళింది. కరోనా నిబంధనలు ఆటగాళ్లు పాటించాల్సి ఉంది. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం కరోనా నిబంధనలను పక్కన పెట్టారు. దీంతో ఆ దేశానికి చెందిన అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెంగళూరు ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన ఆటగాళ్లు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ స్పోర్ట్స్ మినిస్టర్ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ అయిన బెంగళూరుకు చెందిన ఆటగాళ్లు మాలెలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారు. దీంతో మాల్దీవ్స్ స్పోర్ట్స్ మినిస్టర్ అహ్మద్ మాలూఫ్ బెంగళూరు జట్టును దేశం విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై బెంగళూరు ఎఫ్.సి. ఓనర్ పార్థ్ జిందాల్ ట్విట్టర్ ద్వారా మాల్దీవ్స్ స్పోర్ట్స్ మినిస్టర్ కు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చర్యలను తాము అసలు ఉపేక్షించలేమని.. తప్పు చేసిన ఆటగాళ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఘటనలు ఇకపై జరగవని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఏ.ఎఫ్.సీ. కప్ లో బెంగళూరు ఎఫ్.సి. ఆడుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. బెంగళూరు ఎఫ్.సి. జట్టుకు సునీల్ ఛెత్రి కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు.


Next Story