ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తన అలవాట్లను ఇంకా మర్చిపోయినట్లుగా లేడు. దీంతో అతడు అంపైర్ల ఆగ్రహానికి గురైయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంతిని షైన్ చేసే క్రమంలో లాలాజం(సెలైవా) రుద్దడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాత్కాలికంగా నిషేదం విధించిన సంగతి తెలిసిందే. కరోనా ఇంకా సమసిపోని నేపథ్యంలో ఇంకా ఈ నిషేదం కొనసాగుతోంది. ఒకవేళ ఎవరైననా ఈ రూల్స్ అతిక్రమిస్తే మొదటిసారి హెచ్చరిస్తారు. రెండోసారి కూడా పునరావృతం చేస్తే, సదరు ఆటగాడు ప్రాతినిథ్య వహిస్తున్న జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు.
ఇక పుణె వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను టాప్లే వేశాడు. రెండో బంతి వేసిన తరువాత స్టోక్స్ మరిచిపోయి బంతికి లాలాజం రుద్దాడు. దీనిని గమనించిన అంపైర్లు నితిన్ మేనన్, వీరేందర్ శర్మ ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్‌ను పిలిచి హెచ్చరించారు. అనంతరం బంతిని శానిటైజ్ చేసి ఆటను కొనసాగించారు. అయితే.. అదే ఓవర్ శిఖర్ ధావన్ ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ అందుకోవడం గమనార్హం. అయితే.. స్టోక్స్ ఇలా బంతికి ఉమ్ము రుద్దడం ఇదే తొలిసారి కాదు. ఇదే పర్యటనలో గులాబి టెస్టులో బంతికి లాలాజలం రుద్దుతూ దొరికిపోయాడు.