బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి ఔట్
Ben Stokes takes indefinite break from cricket.టీమ్ఇండియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగు రోజుల
By తోట వంశీ కుమార్ Published on 31 July 2021 10:49 AM ISTటీమ్ఇండియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగు రోజుల ముందు ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటున్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కు తెలియజేశాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందనీ చెప్పాడు. ఇందుకు ఈసీబీ కూడా ఒప్పుకుంది. కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో బెన్‌స్టోక్స్ తీసుకున్న నిర్ణయం పై ప్రస్తుత క్రీడా లోకంలో పెద్ద చర్చే జరుగుతోంది.
బెన్‌స్టోక్స్ కొంత మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడని, అందువల్లే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో అతనికి బోర్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నాడు. ఎన్ని రోజులైనా అతను విశ్రాంతి తీసుకోవచ్చని, ఈ విషయంలో అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని హామీ ఇచ్చాడు. తాను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే అప్పుడు జట్టులో చేరొచ్చని స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని నిరభ్యంతరంగా ప్రకటించినందుకు అతణ్ని అభినందిస్తున్నట్లు చెప్పాడు.
కరోనా మహమ్మారి కారణంగా ఆటకు అవాంతరాలు కలగకుండా ఉండేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్‌ను అమలు చేస్తోన్నాయి. ఒక్కసారి ఈ బబుల్‌లో ప్రవేశిస్తే.. సిరీస్ ముగిసే వరకు అందులో ఉన్న వారితోనే గడపాల్సి వస్తోంది. చివరికి కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు వీలుండదు. ఇందులో ఇమడలేక పోవడం వల్లే బెన్‌స్టోక్స్ నిరవధిక విరామాన్ని తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బెన్‌స్టోక్స్ కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నాడు. ప్రత్యేకించి- గత ఏడాది మొత్తం అతను ఇంటికి దూరం అయ్యాడు.
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటన.. ఆ వెంటనే మళ్లీ ఐపీఎల్ 2021, అది ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు బెన్. ఆ తరువాత పాక్‌తో సిరీస్ ఇలా నిరవధికంగా క్రికెట్ ఆడుతూ.. చాలా కాలంగా బబుల్‌లోనే ఉంటున్నాడు. ఇక గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్‌స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్‌తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఇది కూడా బెన్‌స్టోక్స్‌ను మానసికంగా కుంగదీసి ఉంటుందనే వాదనలు ఉన్నాయి.