ఓట‌మి బాధ‌లో ఉన్న రాజ‌స్థాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. స్టోక్స్ ఔట్

Ben Stokes ruled out of IPL 2021. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఇప్ప‌ట్లో క‌ష్టాలు త‌ప్పేలా లేవు. బెన్‌స్టోక్స్ ఐపీఎల్ టోర్న‌మెంట్‌కు దూరం అయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 8:38 AM IST
Ben Stokes

తొలి మ్యాచ్‌లో ఓట‌మి బాధ‌లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఇప్ప‌ట్లో క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ సేవ‌లు కోల్పోయిన ఆ జ‌ట్టుకు తాజాగా మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ ఐపీఎల్ టోర్న‌మెంట్‌కు దూరం అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా.. క్రిస్ గేల్ క్యాచ్‌ను ప‌ట్టేక్ర‌మంలో స్టోక్స్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది. స్కానింగ్‌లో వేలికి ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు తేలింది. దీంతో ఈ సీజ‌న్ మొత్తానికి స్టోక్స్ దూరం అయిన‌ట్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పంజాబ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో మొద‌ట ఓ క్యాచ్ వ‌దిలిపెట్టాడు స్టోక్స్‌.. ఆ త‌రువాత గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డ్రైవ్ చేస్తూ మ‌రీ ప‌ట్టాడు. కానీ వెంట‌నేచేతిని విదిలించుకుంటూ ఇబ్బందిగా క‌నిపించాడు. ఆ త‌రువాత అలాగే పీల్డింగ్‌, బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చి ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే డకౌట్ అయ్యాడు.

'రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులోని ప్రతి ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను ఎంతగానో ప్రేమిస్తాడు. జట్టుకు ఉన్న అతిపెద్ద ఆస్తి అతడు. మైదానం లోపల, వెలుపల రాయల్స్‌ కుటుంబంలో అతడికి తగినంత ప్రాధాన్యం ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్టోక్స్ ఎడ‌మ వేలికి గాయ‌మైంది. వైద్య ప‌రీక్ష‌ల్లో అత‌డి వేలు విరిగిన‌ట్లు తెలిసింది. దీంతో ఈ సీజ‌న్ మొత్తానికి బెన్ దూర‌మ‌య్యాడు. మ్యాచ్‌లు ఆడ‌కున్నా ఇక్క‌డే ఉండి మైదానం బ‌య‌ట నుంచి బెన్ స‌ల‌హాలు ఇవ్వ‌బోతున్నాడు. స్టోక్స్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. త్వరలోనే తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సిద్ధం చేస్తాం'. అని రాజ‌స్థాన్ ట్వీట్ చేసింది.




Next Story