ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్..?

Corona vaccination to IPL Players.ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై తాము ఆలోచ‌న చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు.

By Medi Samrat  Published on  4 April 2021 2:44 PM GMT
IPL Players vaccination

ప్రస్తుతం ఐపీఎల్ కు ఓ వైపు సన్నాహకాలు జరుగుతూ ఉండగా.. కరోనా మహమ్మారి లీగ్ ను కమ్మేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది.. ఇక ముంబై లోని వాంఖడే స్టేడియం నిర్వాహకులకు కూడా కరోనా సోకడంతో ఐపీఎల్ నిర్వాహకుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. దీంతో ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ వేస్తే బెటర్ అని భావిస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై తాము ఆలోచ‌న చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు.

తాము ఆరోగ్యశాఖ‌తో సంప్ర‌దిస్తున్నామ‌ని, ఆట‌గాళ్ల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని అడుగుతున్న‌ట్లు చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కేవ‌లం ఆరు వేదిక‌ల్లోనే ఐపీఎల్ నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఆ దిశ‌గా బ‌యో బ‌బుల్ ఏర్పాటు చేశామ‌ని శుక్లా చెప్పారు. జట్లలో స‌భ్యుల సంఖ్య‌ను కూడా పెంచిన‌ట్లు తెలిపారు. ప్రేక్ష‌కులు లేకుండానే టోర్నీ కొన‌సాగుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఆటగాళ్లకు కరోనా సోకకుండా అన్ని ఏర్పాట్లు చేశామని బయో బబుల్ లో కఠిన ఆంక్షలు ఉంటాయని.. ఏ ఒక్కరు కూడా ఇందుకు అతీతం కాదని తేల్చేశారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు యంగ్ క్రికెటర్, దేశవాళీ సంచలనం దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డాడు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ క‌రోనా బారిన ప‌డ్డాడని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. ప్ర‌స్తుతం అత‌డు క్వారంటైన్‌లో ఉన్నాడు. వచ్చే శుక్రవారం మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.. ఆ మ్యాచ్ సమయానికి పడిక్కల్ అందుబాటులోకి రావడం కష్టమే..! ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ కూడా క‌‌రోనా బారిన ప‌డ్డాడు.

ఇంత‌కు ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ నితీష్ రాణాకు కూడా కరోనా సోకింది.. అతడు దాని నుంచి కోలుకొని మ‌ళ్లీ టీమ్‌తో చేరాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ కంటెంట్ టీమ్‌లోని స‌భ్యుడు ఒక‌రు క‌రోనా బారిన ప‌డ్డాడు. వాంఖడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఐపీఎల్ పోటీల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించిన ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపించి వేసి, వారి స్థానంలో కొత్త సిబ్బందిని తీసుకున్నారు.


Next Story