ఆ స్టేడియంలకు మహర్దశ తీసుకుని రానున్న బీసీసీఐ.. ఆ లిస్టులో హైదరాబాద్ కూడా..!
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఈ ఏడాది భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ను అత్యంత
By M.S.R Published on 11 April 2023 7:15 PM ISTఆ స్టేడియంలకు మహర్దశ తీసుకుని రానున్న బీసీసీఐ.. ఆ లిస్టులో హైదరాబాద్ కూడా..!
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఈ ఏడాది భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు భారతదేశంలోని కనీసం ఐదు ప్రధాన స్టేడియాలను భారీ స్థాయిలో మెరుగులు దిద్దాలని BCCI యోచిస్తోంది.
గత 10 ఏళ్లలో బీసీసీఐ భారీగా డబ్బును ఆర్జించింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన BCCI క్రికెట్ స్టేడియంలలో మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం చాలా దారుణంగా తయారైంది. మన క్రికెట్ బోర్డు కంటే తక్కువ ఆర్జించే దేశాల్లోని స్టేడియంలలో సదుపాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. కానీ భారతదేశంలోని చాలా వేదికలలో ప్రాథమిక సౌకర్యాలు కూడా సరిగా లేవన్నది నిజం.
ఫిబ్రవరి-మార్చిలో భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ సందర్భంగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నగరాల్లో ప్రముఖ స్టేడియంలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో బీసీసీఐ ఆయా స్టేడియంలలో వసతులను మెరుగుపర్చాలని భావిస్తూ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, మొహాలీ, ముంబై స్టేడియంలలో మార్పులు చేయాలని భావిస్తోంది. ముంబైలోని వాంఖడేలో పారిశుధ్యత లోపించిందని ఒక అభిమాని ఫిర్యాదు చేయడంతో మార్పులు చేయాలని భావిస్తూ ఉన్నారు.
ఐదు వేదికల పునర్నిర్మాణానికి అంచనా వ్యయం వందల కోట్లని తెలుస్తోంది. ఢిల్లీ స్టేడియం పునరుద్ధరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్‌కు రూ.117.17 కోట్లు, కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌కు రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియంకు రూ.79.46 కోట్లు, వాంఖడేకు రూ.78.82 కోట్లు ఖర్చవుతుంది. పైకప్పులు కూడా మార్చాలని అనుకుంటే మాత్రం ఖర్చులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడానికి పన్నెండు వేదికలు ఎంపిక చేశారు. వాటిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై ఉన్నాయి.