ఈ ఏడాది ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను ఎప్పుడు నిర్వహించాలా అని బీసీసీఐ తర్జనభర్జనలు మొదలుపెట్టింది. గత కొద్దిరోజులుగా ఐపీఎల్ సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉందని కథనాలు వస్తూ ఉండగా.. దాదాపుగా అదే నెల కన్ఫర్మ్ అయ్యేలా తెలుస్తోంది. కేవలం మూడు వారాల్లో మిగిలిన మ్యాచ్ లను పూర్తీ చేయనున్నారు. 10 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచులను సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులు సెప్టెంబర్ 18 లేదా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మిగిలిపోయిన మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నారు. 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది. 31 మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం టీం ఇండియా ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఇంగ్లాండ్ తో అయిదు టెస్టులు ఆడి ఆగస్టు చివరి వారానికి ఐపీఎల్ జట్లల్లోని ఆటగాళ్లంతా దుబాయ్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే కఠిన బయో బబుల్ లో ఉండనున్నారు.