విరాట్ కోహ్లీ, పంత్‌ల‌కు విశ్రాంతి.. మూడో టీ20కి దూరం..!

BCCI gives Virat Kohli and Rishabh Pant break from bio-bubble.కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 1:13 PM IST
విరాట్ కోహ్లీ, పంత్‌ల‌కు విశ్రాంతి.. మూడో టీ20కి దూరం..!

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ లు మూడో టీ20కి దూరం కానున్నారు. వీరిద్ద‌రికి ప‌ది రోజులు విశ్రాంతినిచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్ద‌రూ వెస్టిండీస్‌తో మూడో టీ20తో పాటు స్వ‌దేశంలో శ్రీలంక‌తో జ‌రిగే మూడు టీ20 సిరీస్‌కు దూరంకానున్నారు. ఇక‌ మార్చి 4 నుంచి మొహాలి వేదిక‌గా జ‌ర‌గ‌బోయే రెండు టెస్టుల సిరీస్‌కు తిరిగి జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నారు.

కాగా.. గ‌త కొద్ది రోజులుగా కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ద‌క్షిణాఫ్రికాతో ప‌ర్య‌ట‌న‌లో రెండో టెస్టు మిన‌హా.. అన్ని మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌తోనూ ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన మూడు వ‌న్డేలు, రెండు టీ20ల్లో విరాట్ ఆడాడు. కాగా.. వ‌చ్చే నెల‌లో శ్రీలంక‌తో జ‌రిగే తొలి టెస్టు కోహ్లీకి వందో మ్యాచ్ కానుంది. దీంతో ఆ కీల‌క టెస్టుకు ముందు అత‌డికి కాస్త విశ్రాంతి ఇచ్చి.. మ్యాచ్ స‌మ‌యానికి తాజాగా ఉంచాల‌న్న‌ది బీసీసీఐ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్‌ సేన 8 పరుగుల తేడాతో గెలుపొంది. ఈ మ్యాచ్‌లో రిష‌బ్ పంత్‌ (28 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లీ (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. రిషభ్‌ పంత్ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక నామ‌మాత్ర‌మైన మూడో టీ20 ఫిబ్రవరి 20న జ‌ర‌గ‌నుంది.

Next Story