'హ్యాండ్‌షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.
By - Medi Samrat |
'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ తర్వాత కరచాలనం చేయడం అనేది నిబంధనలలో లేదని, అది కేవలం స్నేహపూర్వక సంప్రదాయం మాత్రమేనని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ చేసిన ఫిర్యాదుకు ఎలాంటి విలువ లేదని కొట్టిపారేసింది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత, భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత ఆటగాళ్ల తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ "ఎవరికైనా సందేహం ఉంటే, ముందుగా క్రికెట్ రూల్ బుక్ చదువుకోవాలి. ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అది ఆటగాళ్ల మధ్య ఉండే స్నేహభావం, సత్సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అంతేతప్ప, అదొక చట్టం కాదు. కాబట్టి, భారత క్రికెటర్లు నిబంధనలను ఉల్లంఘించారనడంలో అర్థం లేదు" అని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు. గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ బృందంతో కరచాలనం చేయడానికి నిరాకరించిన భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు మ్యాచ్ ప్రారంభంలో లేదా చివరిలో పాకిస్తాన్‌తో కరచాలనం చేయలేదు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కరచాలనం చేయలేదు. యాదృచ్ఛికంగా, టోర్నమెంట్‌కు ముందు కెప్టెన్ల విలేకరుల సమావేశంలో కూడా సూర్యకుమార్, ఆఘా కరచాలనం చేయలేదు. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా షాకివ్వడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు అవాక్కయారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మ్యాచ్ తర్వాత జరిగే బహుమతి ప్రజెంటేషన్ వేడుకను బహిష్కరించడానికి దారితీసింది.