విరాట్ కోహ్లీకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు
BCCI did not give Virat respect says Former Pakistan bowler Danish Kaneria.భారత వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ
By తోట వంశీ కుమార్
భారత వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై యావత్ క్రికెట్ ప్రపంచం రెండుగా విడిపోయింది. కోహ్లీ స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఎంపిక చేయడాన్ని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు స్పిన్నర్ డానిష్ కనేరియా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీరును తప్పుబట్టాడు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. స్టార్ ఆటగాడు అయిన కోహ్లీకి బీసీసీఐ కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నాడు. విరాట్‌ను మరింత హుందాగా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తప్పా..? కాదా..? అన్నది తాను చర్చించడం లేదని.. కేవలం అతన్ని హుందాగా తప్పించాల్సి ఉందని చెబుతున్నట్లు తెలిపాడు. భారత్‌కు విరాట్ 65 మ్యాచ్‌లో విజయాన్ని అందించాడన్నారు. అత్యధిక మ్యాచుల్లో విజయాలను అందించిన భారత కెప్టెన్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడని.. అంత మంచి రికార్డు ఉన్న కోహ్లీని ఒప్పించకుండా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం సరికాదన్నాడు. కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవచ్చు.. కానీ కెప్టెన్‌గా టీమ్ఇండియాను అతను నడిపించిన మార్గం అసాధారణమైనదని తెలిపాడు.
ఇక ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో ఇద్దరు సూపర్ స్టార్లు మాత్రమే తనకు కనిపిస్తున్నట్లు తెలిపాడు. అందులో ఒకరు విరాట్ కోహ్లీ కాగా.. మరొకరు బాబర్ ఆజామ్ అని తెలిపాడు. సౌరవ్ గంగూలీ చాలా గొప్ప వ్యక్తి, మాజీ కెప్టెన్ కూడా.. అతను మేము రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నట్లు విరాట్‌కు ముందే చెప్పాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో కోహ్లీ పరుగులు చేయకపోవడం కూడా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడానికి ఓ కారణమైందని కనేరియా చెప్పుకొచ్చాడు.