ఐపీఎల్ లో కరోనా కలకలం.. మ్యాచ్ లు డౌటే..?

BCCI Confirms Reschedule of KKR vs RCB Match. ఐపీఎల్ లో కరోనా కలకలం మొదలైంది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.

By Medi Samrat
Published on : 3 May 2021 7:51 AM

IPL 2021

బయోబబుల్ లో ఎంతో జాగ్రత్తగా ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ఐపీఎల్ లో కరోనా కలకలం మొదలైంది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అయితే మిగిలిన ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారి ఏఎన్‌ఐతో చెప్పుకొచ్చారు.

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతూ ఉండగా ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. బయో బబుల్‌లో ఉండలేక లీగ్‌ నుంచి వైదొలిగారు. ఇక అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్‌ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. టోర్నమెంట్ ను వాయిదా వేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

ఆదివారం సాయంత్రం వరుణ్ చక్రవర్తికి కరోనా సోకిందనే సమాచారం అందగానే.. అతడు ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడు. పాట్ కమిన్స్, బెన్ కటింగ్ లో కూడా కరోనా లక్షణాలు కనిపించాయని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. అయితే వీరందరికీ కరోనా నెగటివ్ వచ్చిందని కేకేఆర్ టీమ్ తెలిపింది. కేకేఆర్ ఢిల్లీ కేపిటల్స్ తో ఏప్రిల్ 29న అహ్మదాబాద్ లో ఆఖరి మ్యాచ్ ఆడింది. ఇప్పుడు కరోనా కలకలం రావడంతో ఆటగాళ్లలో భయాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రశాంతంగా సాగుతున్న టోర్నమెంట్ లో కరోనా కలకలం రేగడంతో నిర్వాహకులతో పాటూ.. అభిమానులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు.




Next Story