విదేశీ ఆటగాళ్లకు భరోసాను ఇస్తూ బీసీసీఐ కీలక ప్రకటన.. ఇక ఐపీఎల్ సాఫీగా..!
BCCI assures foreign players. విదేశీ ఆటగాళ్లకు భరోసాను ఇస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక ప్రకటన చేసింది.
By Medi Samrat Published on 27 April 2021 4:52 PM ISTప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతూ ఉన్నప్పటికీ.. విదేశీ ఆటగాళ్ల మదిలో కరోనా భయం వెంటాడుతూ ఉంది. భారతదేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయనే భయం ఆటగాళ్లను తప్పకుండా కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో పలువురు ఆటగాళ్లు సొంత దేశాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. టోర్నమెంట్ మధ్యలో ఏ ఆటగాడికి కూడా కరోనా సోకలేదు కానీ.. భారత్ లో ఉన్న పరిస్థితులే బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లను ఇబ్బంది పెడుతోంది.
ఇప్పటికే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ నుండి నిష్క్రమించారు. ఆండ్రూ టై, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ టోర్నీ నుండి వైదొలిగారు. కరోనా సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుండగా.. అది జరగక ముందే ఇంటికి వెళ్లిపోవాలని వార్నర్, స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ భావిస్తున్నారని న్యూస్ లో కథనాలు కూడా వచ్చాయి. అయితే విదేశీ ఆటగాళ్లకు భరోసాను ఇస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ సిఓఓ హేమంగ్ అమిన్ విదేశీ ఆటగాళ్ల కోసం ఓ ప్రకటనను విడుదల చేశారు.
టోర్నమెంట్ ముగియగానే మీ అందరినీ సురక్షితంగా సొంత దేశాలకు పంపించే బాధ్యత తమదేనని.. మీకు ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. మీ గమ్యస్థానాలను చేరుకోడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుందని.. భయపడకండని కోరారు. టోర్నమెంట్ ముగిసిన వెంటనే భారత ప్రభుత్వం కూడా మిమ్మల్ని మీ సొంత ఊళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తుందని.. బీసీసీఐదే బాధ్యత అని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను కట్టడి చేస్తోందని అన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో మనం ప్రజలకు ఆనందాన్ని.. ముఖాలపై చిరునవ్వులను టోర్నమెంట్ ద్వారా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అది ప్రతి ఒక్క ఆటగాడికి గర్వకారణమని గుర్తు చేశారు. విదేశీ ఆటగాళ్లెవరూ భయపడకండని.. జాగ్రత్తగా ఇళ్లకు చేర్చే పూచీ తమదని హేమంగ్ హామీ ఇచ్చారు.