మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Bangladeshi author Taslima Nasreen controversial comments.బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 7 April 2021 3:36 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయి ఉంటే.. సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడని ట్వీట్ చేసి విమర్శల పాలయ్యారు. అసలు ఏం జరిగిందంటే..
త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తగా జెర్సీని రూపొందించింది. అయితే ఆ జర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున దాని బదులు మరో జర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్ అలీ జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. అందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, మద్యం కంపెనీ లోగోలు లేని కొత్త జెర్సీలు అందించిందనీ సమాచారం. ఈ వార్తల నేపథ్యమే మొయిన్ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, తన చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదు కదా? అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తస్లీమా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అయితే ఈ వ్యాఖ్యను తాను సరదాగానే చేశానని తస్లీమా రిప్లయ్ ఇచ్చినప్పటికి వివాదం సద్దుమణగలేదు.
ముస్లిం సమాజాన్ని తాను లౌకికత్వంతో నింపాలని ప్రయత్నిస్తుంటే అందుకు వ్యతిరేకించేవాళ్లే మొయిన్ అలీపై తన ట్వీట్ ను వివాదాస్పదం చేస్తున్నారని తస్లీమా వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ మత మౌఢ్యాన్ని తాను ప్రశ్నిస్తుండడంతో తనను విమర్శిస్తున్నారని, ఈ మానవాళికి సంబంధించి అతిపెద్ద విషాదం ఏమిటంటే.. మహిళోద్ధారకులుగా పేరుగాంచిన వామపక్ష వర్గీయులే ఇస్లామిక్ మహిళా వ్యతిరేకులకు మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నస్రీన్ ఆపై తన ట్వీట్ ను తొలగించారు.
అయితే లోగో అంశంలో మొయిన్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు.