ఉత్కంఠ పోరులో బంగ్లాదే విజయం
Bangladesh won by 3 runs against zimbabwe in T20 World cup 2022.బంగ్లాదేశ్-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరు
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 8:45 AM GMTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో మరో ఉత్కంఠ పోరు జరిగింది. బంగ్లాదేశ్-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు బంగ్లాదేశ్‌ను విజయం వరించింది. జింబాబ్వే పై మూడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ ముల్ హుస్సేన్ శాంటో (71; 55 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఆఫీఫ్ హుస్సేన్(29), షకీబ్ అల్ హసన్(23) కాస్త సహకారం అందించారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఓ మోస్తారు స్కోరుకే బంగ్లా పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ చెరో రెండు వికెట్లు తీయగా రజా, సీన్ విలియమ్స్ ఒక్కో పడగొట్టారు.
అనంతరం 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఓపెనర్లు మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ సింగిల్ డిజిట్‌లకే పెవిలియన్ కు చేరారు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్న సీన్ విలియమ్స్ జట్టును ఆదుకున్నాడు. విలియమ్స్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. అతడికి ర్యాన్ బురి (27 ) సహకారం అందించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్ల తీయగా.. హుస్సేన్, రెహ్మన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం..
ఆఖరి ఓవర్‌లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. బౌలర్ మొసద్దెక్ హుస్సేన్. తొలి బంతికి లైగ్ రూపంలో పరుగు రాగా.. రెండో బంతికి ఎవెన్స్ ఔట్ అయ్యాడు. దీంతో విజయ సమీకరణం 4 బంతుల్లో 15 పరుగులు గా మారింది. మూడో బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు పరుగులు రాగా.. నాలుగో బంతిని నగరవా భారీ సిక్స్ బాదాడు. దీంతో మ్యాచ్ తీవ్రఉత్కంఠంగా మారింది. రెండు బంతుల్లో 5 పరుగులు చేస్తే జింబాబ్వే గెలుస్తుంది. అయితే.. ఆఖరి బంతికి నగరవా స్టంపౌట్ కావడంతో బంగ్లాదేశ్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.
అయితే.. ఇక్కడో ట్విస్ చోటు చేసుకుంది. కీపర్ స్టంప్స్‌కు ముందే బంతిని పట్టుకోవడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీ హిట్ బంతికి జింబాబ్వే ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది.