దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
Bangladesh script history with 2-1 series win.దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 5:15 AM GMTదక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తస్కిన్ అహ్మద్ ఐదు వికెట్లతో సపారీల పతనాన్ని శాసించాడు. దీంతో సఫారీలు 37 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌తో పాటు షకీబ్ రెండు, మెహదీ హసన్ మిరాజ్, షోరిపుల్ ఒక్కొవికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ జానెమన్ మలన్ (39) రాణించగా.. మిల్లర్ (16), డికాక్ (12), వెర్రెయిన్నే (9), రబాడ (4), డస్సెన్ (4), షంసీ (3), బవుమా (2) దారుణంగా విఫలం అయ్యారు.
అనంతరం 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు వికెట్ నష్టపోయి 26.3 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు తమిమ్ ఇక్భాల్(87 నాటౌట్; 82 బంతుల్లో 14 పోర్లు), లిటన్ దాస్(48; 57 బంతుల్లో 8 పోర్లు) తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన షకీబ్(18 నాటౌట్)తో తమిమ్ మిగతా పనిని పూర్తి చేశాడు. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ గెలువగా, రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తస్కిన్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.
కాగా.. ఈ ఏడాది జనవరిలో ఇదే సౌతాఫ్రికా గడ్డపై 3 వన్డేల సిరీస్ ఆడిన టీమ్ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే.