న్యూజిలాండ్ ను చిత్తుచేసి చారిత్రాత్మక విజ‌యాన్ని సాధించిన బంగ్లాదేశ్‌

Bangladesh Crush New Zealand To Score Historic Test Win.బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. మౌంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 8:52 AM IST
న్యూజిలాండ్ ను చిత్తుచేసి చారిత్రాత్మక విజ‌యాన్ని సాధించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. మౌంట్ మాంగ‌నుయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌కు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో తొలి ప్ర‌పంచ టెస్టు ఛాంఫియ‌న్ ను ఓడించి కొత్త సంవ‌త్స‌రాన్ని ఘ‌నంగా ఆరంభించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌లో సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఇక రెండో టెస్టు జనవరి 9 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో ఆరంభం కానుంది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 147/5 ఐదో రోజు ఆట‌ను ఆరంభించిన కివీస్ మ‌రో 22 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన ఐదు వికెట్లును కోల్పోయింది. దీంతో బంగ్లా ముందు 42 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం మాత్ర‌మే ఉంచింది. ఈ ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి మాత్ర‌మే చేదించింది. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 ఆలౌట్ కాగా.. బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ (88), లిటన్ దాస్ (86), మహ్మదుల్ హసన్ జాయ్ (78), నజ్ముల్ హొస్సేన్ శాంటో (64) అర్ధ సెంచరీల‌తో రాణించ‌డంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసింది. దీంతో 130 ప‌రుగుల కీల‌క ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 169 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వైవిధ్య‌మైన బౌలింగ్‌తో 7 వికెట్లు ప‌డ‌గొట్టి బంగ్లాదేశ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన ఇబాదత్‌ హొస్సేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ విజ‌యంతో బంగ్లాదేశ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ 12 పాయింట్లు ద‌క్కాయి.

Next Story