సొంత గడ్డపై బంగ్లాదేశ్ జట్టు రెచ్చిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ పై టెస్ట్ మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా, షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో బాదిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. మోమినుల్ హక్ కూడా సెంచరీ సాధించాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో 115 పరుగులు మాత్రమే చేసింది.
21వ శతాబ్దంలో బంగ్లాదేశ్ అతిపెద్ద విజయం దక్కించుకున్న టీమ్ గా నిలిచింది. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.