టార్గెట్ తెలీకుండానే ఛేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు
Bangladesh bat without knowing target. టీ20 సిరీస్,బంగ్లాదేశ్ జట్టు ఎంత ఛేజింగ్ చేయాలో కూడా తెలియకుండానే ఇన్నింగ్ ను మొదలు పెట్టింది.
By Medi Samrat Published on 31 March 2021 9:07 AM GMT
ప్రస్తుతం బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ నడుస్తూ ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు పూర్తవ్వగా.. రెండు మ్యాచ్ లలోనూ న్యూజిలాండ్ గెలిచింది. రెండో టీ20లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే.. బంగ్లాదేశ్ జట్టు ఎంత ఛేజింగ్ చేయాలో కూడా తెలియకుండానే ఇన్నింగ్ ను మొదలు పెట్టింది.
న్యూజిలాండ్‌తో రెండో టి20లో ఛేదనకు బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. కానీ ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో తెలియని పరిస్థితి.. ఎటువంటి క్లారిటీ లేకుండానే అంపైర్లు ఆట మొదలు పెట్టేశారు. ఈ మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై, కివీస్ అధికారిక ట్విట్టర్‌లో 16 ఓవర్లలో 148గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో డక్‌వర్త్ లూయిస్ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. కానీ చివరకు 171 పరుగులుగా ఖరారు చేశారు!
వర్ష సూచన ఉన్నప్పుడు ఓవర్లు, వికెట్ల ప్రకారం చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇన్నింగ్స్ విరామం మధ్యలో ఇరు జట్లకు ఒక షీట్‌ను అందిస్తారు. సరిగ్గా లెక్క చేయలేక వాటిని ఇవ్వకపోవడంతో ఇలా చోటు చేసుకుందని జెఫ్ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఈ సిరీస్ లో మూడో టీ20 రేపు జరగనుంది.