ఆర్‌సీబీనే నమ్ముకున్నావా..? ఇక నీకు పెళ్లి అయిన‌ట్లే

Bangalore Fan Girl’s Picture Goes Viral.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2022 8:41 AM GMT
ఆర్‌సీబీనే నమ్ముకున్నావా..?  ఇక నీకు పెళ్లి అయిన‌ట్లే

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క‌థ ముగిసింది. ఈ ఏడాది కూడా ఆ జ‌ట్టు క‌ప్పు కొట్ట‌కుండానే వెనుదిరిగింది. క్వాలిఫ‌య‌ర్ 2లో రాజ‌స్థాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సార‌థ్యంలోనైనా జ‌ట్టు తొలిసారి క‌ప్పు అందుకుంటుంద‌ని బావించిన ఆర్‌సీబీ అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. ఈ నేప‌థ్యంలోనే ఓ ఆర్‌సీబీ మ‌హిళా అభిమానికి సంబంధిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ సీజ‌న్‌లో బెంగ‌ళూరు ఆడిన ఓ లీగ్ మ్యాచ్ లో ఆర్‌సీబీకి వీరాభిమాని అయిన ఓ మ‌హిళ స్టాండ్స్‌లో ఫ్లకార్డు ప‌ట్టుకుని నిల్చుకుంది. ఆమెపై కెమెరాలు ఫోక‌స్ చేయ‌గా.. ఆ ఫ్ల‌కార్డుపై 'ఐపీఎల్‌లో ఆర్‌సీబీ క‌ప్పు కొట్టేంత వ‌ర‌కు తాను పెళ్లి చేసుకోను' అని రాసి ఉంది. అప్పుడు ఆ మ‌హిళా అభిమాని ఫ్ల‌కార్డు ప‌ట్టుకున్న ఫోటో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా బెంగ‌ళూరు ఫైన‌ల్ చేర‌కుండానే ఇంటి ముఖం ప‌ట్ట‌డంతో మ‌రోసారి ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'ఆర్‌సీబీ క‌ప్పు కొట్ట‌దు.. నువ్వు పెళ్లి చేసుకోలేవు' అని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. 'పోయి పోయి ఆర్సీబీతోనే పెట్టుకున్నావా.. ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు పో' అని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ(7) పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించ‌గా, డుప్లెసిస్‌(25), మాక్స్‌వెల్‌(24), దినేశ్ కార్తీక్‌(6) ఆశించిన రీతిలో రాణించ‌లేక‌పోయారు. అయితే.. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో సూపర్ శ‌త‌కంతో స‌త్తా చాటిన ర‌జ‌త్ ప‌టీదారు(58; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కంతో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. రాజస్థాన్‌ బౌలర్లలో మెక్‌కాయ్‌, ప్రసిద్ధ్‌ కృష చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 18.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి చేదించింది. ఈ సీజ‌న్‌లో పుల్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌ (106 నాటౌట్‌; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మ‌రోసారి శ‌త‌కంతో చెల‌రేగిపోయాడు. దీంతో మ్యాచ్ ఏక‌ప‌క్షంగా మారింది. బ‌ట్ల‌ర్‌కు తోడు యశస్వి జైస్వాల్‌ (21; 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (23; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) చెరో చేయి వేయ‌డంతో ఏ ద‌శ‌లోనూ బెంగ‌ళూరు విజ‌యం సాధించేలా క‌నిపించ‌లేదు.

Next Story