ఒకే బాట‌లో చెన్నై, ముంబై.. వ‌రుస‌గా 4వ ప‌రాజ‌యం

Bangalore defeat Mumbai by 7 wickets.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) పాయింట్ల ప‌ట్టిక‌లో ఎప్పుడూ అగ్ర‌స్థానానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 9:23 AM IST
ఒకే బాట‌లో చెన్నై, ముంబై.. వ‌రుస‌గా 4వ ప‌రాజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) పాయింట్ల ప‌ట్టిక‌లో ఎప్పుడూ అగ్ర‌స్థానానికి పోటీ ప‌డే రెండు జ‌ట్లు ఈ సీజ‌న్‌లో ఘోరంగా విఫ‌లం అవుతున్నాయి. అంచ‌నాల‌ను అందుకోలేక అట్ట‌డుగు స్థానాల కోసం ఆరాట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆ రెండు జ‌ట్లు ఏమిట‌నేవి అర్థం అయి ఉంటుంది గ‌దా. అవే చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్‌. శ‌నివారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో చైన్నై సూప‌ర్ కింగ్స్ ఓడిపోగా.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ముంబై ఇండియ‌న్స్ ఓటమి పాలైంది. దీంతో ఇరు జ‌ట్లు(చెన్నై, ముంబై) ఈ సీజ‌న్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓట‌ముల‌ను చ‌విచూశాయి.

తొలుత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రోహిత్‌ సేనను కట్టడి చేసిన బెంగళూరు.. ఆ త‌రువాత‌ అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ మెరుపులతో టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (68 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (26) ఫర్వాలేదనిపించారు. బ్రేవిస్‌ (8), తిలక్‌ వర్మ (0), పొలార్డ్‌ (0), రమన్‌దీప్‌ సింగ్‌ (6)లు విఫ‌లం అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, హ‌సరంగ చెరో రెండు వికెట్లు తీయ‌గా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. అనంతరం అనూజ్‌ రావత్‌ (66; 47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా.. విరాట్‌ కోహ్లీ (48; 5 ఫోర్లు) కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌డంతో లక్ష్యాన్ని బెంగ‌ళూరు 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేదించింది. రావత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

బోణీ కొట్టిన హైద‌రాబాద్‌..

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (48; 35 బంతుల్లో 3పోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. అంబటి రాయుడు (27), కెప్టెన్‌ రవీంద్ర జడేజా (23) ఫర్వాలేదనిపించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, న‌ట‌రాజ‌న్ చెరో వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం చేధ‌న‌లో యువ ఆట‌గాడు అభిషేక్‌ శర్మ (75; 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి ( 39 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించ‌డంతో 17.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేదించింది హైద‌రాబాద్.

Next Story