విరాట్ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు.. బాబర్ ఆజామ్ చిట్కాలు
Babar Azam tips Virat Kohli resurgence.విరాట్ కోహ్లీ.. ఈ పేరు చాలు ప్రత్యర్థి జట్లు మ్యాచ్‌కు ముందే సగం డీలా
By తోట వంశీ కుమార్ Published on 15 July 2022 2:51 PM ISTవిరాట్ కోహ్లీ.. ఈ పేరు చాలు ప్రత్యర్థి జట్లు మ్యాచ్‌కు ముందే సగం డీలా పడడానికి. తన బ్యాటుతో అంతలా ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా శతకాలపై శతకాలు బాదాడు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం కోహ్లీ టైం అస్సలు బాగాలేదు. గత మూడేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనైనా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇంగ్లాండ్‌లోనైనా రాణిస్తాడు అనుకుంటే అదీ లేదు. ఇంగ్లీష్ గడ్డపైనా ఈ పరుగుల యంత్రం వైఫల్యం కొనసాగుతోంది. దీంతో ఇంటా బయట విరాట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
లార్డ్స్‌లో ముగిసిన రెండో వన్డేలోనూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో వాటి తీవ్రత కాస్త మరింత పెరిగింది. కోహ్లీ పనైపోయిందని, ఇక అతణ్ని జట్టు నుంచి సాగనంపాల్సిన అవసరం ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కపిల్ దేవ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. ఎవరు ఎమన్నా సరే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కోహ్లీపై నమ్మకం ఉంచారు.
వీరే కాకుండా అతడి సమకాలిన క్రికెటర్ల నుంచి కోహ్లీకి పూర్తి మద్దతు లభిస్తోంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్‌లు విరాట్‌కు అండగా నిలిచారు. అతనిపై వస్తోన్న విమర్శలను కొట్టి పారేస్తోన్నారు. 'కోహ్లి కూడా మనిషే.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో అతడు తక్కువ స్కోర్లకే పరిమితమై ఉండవచ్చు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. తను అత్యుత్తమ బ్యాటర్లలో ఒక్కడు. ఇంకా చెప్పాలంటే.. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్. సుదీర్ఘ కాలంగా అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. అయితే, ఏ ఆటగాడైనా ఒక్కోసారి ఫామ్‌లేమితో సతమతమవడం సహజం. మెరుగైన ప్రదర్శన చేయలేకపోతారు. కోహ్లీ గొప్ప ప్లేయరా? కాదా? అనేది అతని రికార్డులను తిరగేస్తే తెలిసిపోతుంది. ' అని బట్లర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు.
ఈ కఠిన పరిస్థితులు కూడా దాటిపోతాయని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోహ్లీకి బాబర్ ఆజామ్ సూచించాడు. ఈ మేరకు బాబర్ ఆజామ్ ఓ ట్వీట్ చేశాడు. దాన్ని కోహ్లీకి ట్యాగ్ చేశాడు. తాను ఎదుర్కొంటోన్న ఈ కఠిన పరిస్థితులను కూడా విరాట్ కోహ్లీ త్వరలోనే దాటుకుంటాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను దీనికి జత చేశాడు
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
రెండో వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (47; 64 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్లీ (41; 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ 25 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 16 పరగులు మాత్రమే చేశాడు.