టెన్నిస్ బాల్ క్రికెట్ నా కెరీర్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది : వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో

టీ20 ప్రపంచకప్-2024లో టీమ్ ఇండియా టైటిల్ విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు.

By Medi Samrat  Published on  19 July 2024 4:58 PM IST
టెన్నిస్ బాల్ క్రికెట్ నా కెరీర్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది : వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో

టీ20 ప్రపంచకప్-2024లో టీమ్ ఇండియా టైటిల్ విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అక్షర్‌ మూడు రంగాల్లోనూ సహకరించారు. బౌలింగ్‌లో అవసరమైనప్పుడు వికెట్లు తీశాడు. పరుగులు చేయాల్సిన సమయంలో అక్ష‌ర్ బ్యాట్‌తో రాణించాడు. ఈ రెండే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టడం ఎవరూ మర్చిపోలేరు.

టీ20 ప్రపంచకప్ తర్వాత రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అక్షర్ పటేల్ అతడి స్థానాన్ని భ‌ర్తీ చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. అక్ష‌ర్‌ను చూస్తుంటే ఆ పాత్ర స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేలా క‌నిపిస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో లాంగ్ హిట్స్ కొడుతూ ఒత్తిడిలో బాగా ఆడుతున్నాడు. అయితే దీనిపై అత‌డు మాట్లాడుతూ.. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం వ‌ల‌న‌ తనకు ఈ పని సులభం అయ్యింద‌ని అక్షర్ చెప్పాడు.

క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడ‌టం.. తనకు అన్ని రకాల బంతుల‌ను షాట్లు కొట్టే విధంగా సహాయపడిందని అక్షర్ చెప్పాడు. లెదర్ బాల్‌తో షాట్లు కొట్టే మెరుగైన టెక్నిక్‌పై పనిచేస్తున్నానని.. అయితే టెన్నిస్ బాల్‌తో బ్యాటింగ్ చేయడం.. తన బ్యాటింగ్ మనస్తత్వాన్ని మెరుగుపరిచిందని చెప్పాడు.

టెన్నిస్ బాల్‌తో ఆడిన అనుభ‌వం నా హిట్టింగ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపు ప్రతి బంతిని కొట్టాలి. 10-12 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి బంతికీ ఫోర్‌, సిక్సర్ కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇదే నా షాట్ ఎంపికపై ప్రభావం చూపుతుంది. అయితే ఇంతకుముందు లెగ్ సైడ్‌లో బంతిని కొట్టేవాడిని కానీ లెదర్ బాల్ క్రికెట్‌కు వచ్చాకా.. ప్రతి బంతిని కొట్టడం కుద‌ర‌ద‌ని నేను గ్రహించాను. టెన్నిస్ బాల్ క్రికెట్ ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిందని అక్షర్ చెప్పాడు. నేను పెరుగుతున్న స‌మ‌యంలో తరచుగా ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇది నన్ను చాలా స్థిరంగా, బలంగా చేసింది. నేను ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను. నా కెరీర్‌లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు.

T20 ప్రపంచ కప్-2024 ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు రెండు వికెట్లు త్వరగా కోల్పోగా.. రోహిత్ శర్మ అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి నంబర్-5కి పంపాడు. దీంతో జట్టు లాభపడగా.. బలమైన స్కోరు సాధించడంలో టీమ్ ఇండియా సఫలమైంది. అక్షర్ ఒత్తిడిలో 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

Next Story