మూడో T20.. ఆసీస్‌ టీమ్‌లోకి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌ ఓట‌మికి కార‌ణ‌మైన బ్యాట్స్‌మెన్..!

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  28 Nov 2023 12:49 PM IST
మూడో T20.. ఆసీస్‌ టీమ్‌లోకి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌ ఓట‌మికి కార‌ణ‌మైన బ్యాట్స్‌మెన్..!

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2 మ్యాచ్‌లు గెలిచింది. ఈరోజు భారత్ మ్యాచ్ గెలిస్తే.. సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ఆటగాడు ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు.

సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఏకపక్షంగా గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాట్‌లు రాణించారు. ఆ తర్వాత జరిగిన రెండో టీ20లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పరుగుల వరద పారించింది. మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అయితే.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ నేటి మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడ‌ని స‌మాచారం అందుతోంది. మొదటి రెండు మ్యాచ్‌లలో హెడ్ జట్టులో లేడు. అయితే మూడో మ్యాచ్‌కు హెడ్ జ‌ట్టులోకి తిరిగి జట్టులోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అంత తేలికైన విషయం కాదని క్రీడా దిగ్గ‌జాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రపంచకప్‌లో హెడ్ సెంచ‌రీ భారత్‌ను ఓడించింది. దీంతో ఈ రోజు కూడా హెడ్ మరోసారి బ్యాట్‌తో రాణిస్తే మ్యాచ్ గెలవడం భారత్‌కు అంత సులభం కాదు అంటున్నారు.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 :

ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా.

Next Story